Skip to main content

Warangalvoice

మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి

🔴 కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, ఎంపీ కావ్య విజ్ఞప్తి


వరంగల్ వాయిస్, ఢిల్లీ: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిలో కీలకం కానున్న మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కలిసి ఆమె కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడును పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో కలిశారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, కాబట్టి వెంటనే పనులు ప్రారంభించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రయాణాలతో పాటు కార్గో (సరుకు రవాణా) సేవలు, మెయింటెనెన్స్, ఓవర్ హాల్ రిపేర్ సదుపాయాలు ఉండేలా చూడాలని కోరారు. వరంగల్ నగరం జౌళి (టెక్స్‌టైల్స్), ఇతర పరిశ్రమలతో పారిశ్రామిక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం సమ్మక్క-సారలమ్మ’ జాతరకు దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు ఈ ఎయిర్‌పోర్ట్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎంపీ కడియం కావ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యల నిమిత్తం త్వరలోనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను వరంగల్‌కు పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, గడ్డం వంశీకృష్ణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *