Skip to main content

Warangalvoice

నింగిలోకి దూసుకెళ్లిన ‘రుద్రమ’

  • ఓరుగల్లు గడ్డపై మోడల్ రాకెట్ ప్రయోగం సక్సెస్

వరంగల్ వాయిస్, హనుమకొండ : చారిత్రక వరంగల్ నగరం మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి బండ్ వద్ద నిర్వహించిన ‘రుద్రమ’ మోడల్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఏటీడీఆర్ఎల్, కుడా, వరంగల్ ఎన్ఐటీ సంయుక్త సమన్వయంతో చేపట్టిన ఈ ప్రయోగం విద్యార్థులలో, నగరవాసులలో నూతనోత్సాహాన్ని నింపింది. శనివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో శశాంక్ భూపతి నాయకత్వంలోని ఏటీడీఆర్ఎల్ బృందం రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. కౌంట్‌డౌన్ ముగియగానే ‘రుద్రమ’ రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశం వైపు దూసుకెళ్లింది. ఒకటి, రెండు దశల్లో అద్భుతంగా సాగిన ఈ ప్రయోగం, మూడో దశలో గాలి దుమారం కారణంగా చిన్నపాటి సాంకేతిక ఇబ్బంది తలెత్తినప్పటికీ, ఓవరాల్‌గా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుని విజయవంతమైంది. ఈ చారిత్రక ఘట్టాన్ని గ్యాలరీ నుంచి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆసక్తిగా తిలకించారు. వీరితో పాటు ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శేషగిరిరావు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాకెట్ ప్రయోగం అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని, పరిశోధనా దృక్పథాన్ని పెంచుతుందన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ఇలాంటి ప్రయోగం జరగడం గర్వకారణమని, ఇది భవిష్యత్తులో మరిన్ని పెద్ద ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అద్భుతాన్ని చూసేందుకు భద్రకాళి బండ్ వద్దకు భారీగా నగరవాసులు, విద్యార్థులు తరలివచ్చారు. రాకెట్ నింగిలోకి ఎగిరిన దృశ్యాన్ని చూసి విద్యార్థులు కేరింతలతో హోరెత్తించారు. ప్రయోగాన్ని అందరూ వీక్షించేలా అక్కడ భారీ డిజిటల్ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *