రాజకీయ కుట్రలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు..
⭐ ప్రజల కోసం నిరంతరం పోరాడా
⭐ 13 ఏళ్లు డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించా
⭐ భూపాలపల్లే నా కుటుంబం.. అభివృద్ధే నా అంతిమ లక్ష్యం
⭐ ప్రజల ఆశీర్వాదం ఉంటే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడతా
⭐ గౌతమ్ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా స్వాగతిస్తా
⭐ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ ప్రజల కోసం చేసిన పని, ఎదురైన పోరాటాలు, ఎదురొడ్డి నిలిచిన పరిస్థితులే ఒక నాయకుడి ప్రస్థానానికి అసలైన పునాది. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కుట్రలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగానని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండానే తన పనితీరుతోనే ఎదిగానని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని తన కుటుంబంగా భావిస్తానని, ప్రజల ఆశీర్వాదం లభిస్తే మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో తన రాజకీయ ప్రస్థానం, ఎదురైన పరిణామాలు, భూపాలపల్లి అభివృద్ధి, భవిష్యత్ రాజకీయాలపై ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
పరకాల గడ్డ నుంచి ప్రజా జీవితంలోకి..
పరకాల గడ్డపై పుట్టి, అక్కడే రెండో తరగతి వరకు చదువుకున్నాను. హనుమకొండ సెయింట్ జోసఫ్ పాఠశాలలో పదో తరగతి వరకు, హైదరాబాద్లోనీ మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచే ఉద్యోగం చేయాలనే ఆలోచన కంటే కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఉండేది. వ్యవసాయం అంటే కూడా ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఖాళీ సమయం దొరికితే పొలాల వైపు వెళ్తాను. వ్యవసాయ పనులపై నాకు మంచి అవగాహన ఉంది. చిన్నతనంలో మా ఇంటి వద్దకు వచ్చే కూలీలకు తిండి పెట్టిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి.

విద్యార్థి దశలోనే ఉద్యమాలకు శ్రీకారం..
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పాలిటెక్నిక్ కోర్స్ చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. పాలిటెక్నిక్ విద్యార్థులకు బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం జరిగిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాను. ఆ ఉద్యమాల కారణంగా అకాడమిక్ ఇయర్ కోల్పోయాను. నన్ను మహబూబ్నగర్ కాలేజీకి బదిలీ చేశారు. మా కాలేజీ ప్రిన్సిపాల్ నరహరి నా దూకుడును చూసి భవిష్యత్తులో మంచి నాయకుడవుతావని చెప్పేవారు.1984 లో ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి తొలగించిన సందర్భంలో కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాం. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడే స్వభావం అలవడింది.
1989లో రాజకీయ ప్రస్థానానికి పునాది..
1989 నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగుతున్నాను. యూత్ కాంగ్రెస్లో జిల్లా స్థాయిలో పనిచేశాను. ఆ సమయంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేది. రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్న సమయంలో మా కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. పరకాల లోని మా ఇంటిని పేల్చిన ఘటన కూడా జరిగింది. నాన్న మోహన్ రెడ్డి మొదట రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించినా.. నా పట్టుదల, పోరాటం చూసి తర్వాత అండగా నిలిచారు.
పదమూడేళ్ల పార్టీ ప్రయాణం.. ఓ సుదీర్ఘ అధ్యాయం..
2001లో ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. దాదాపు 13 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగాను. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు పనిచేశాను. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు. టీవీ చానళ్లు కూడా పరిమితమే. పత్రికలు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలే ప్రధాన ఆధారం. ప్రతిరోజూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో మా శ్రమ, పాత్ర కూడా ఉంది. 2014 వరకు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాను. అనేక ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.నన్నెవరూ పదవి నుంచి తొలగించలేదు.నేనే స్వచ్ఛందంగా తప్పుకున్నాను.
పార్టీ మారినా.. సిద్ధాంతాల విషయంలో రాజీపడలేదు..
2004లో టీడీపీ నుంచి టికెట్ ఆఫర్ వచ్చింది. అయితే అప్పటివరకు నేను చేసిన రాజకీయ పోరాటం టీడీపీకి వ్యతిరేకంగానే ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరి టికెట్ తీసుకోవడం సరికాదని భావించాను. అందుకే ఆ అవకాశాన్ని స్వీకరించలేదు. ఎన్టీఆర్పై మాత్రం వ్యక్తిగతంగా నాకు ఎంతో అభిమానం ఉంది. ఆయన తీసుకొచ్చిన కొన్ని పాలనా సంస్కరణలు తన తరానికి కనిపించిన పెద్ద మార్పుల్లో భాగమని భావిస్తాను.
అవకాశం దక్కకపోయినా.. ఎదుగుదల ఆగలేదు..
ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండానే ఈ స్థాయికి వచ్చాను. రాజకీయాల్లో కొందరి ఆధిపత్యాన్ని అధిగమిస్తూ ముందుకు వచ్చాను. ఎంతో కష్టపడ్డాను. నా పనితీరే నా ఎదుగుదలకు కారణం. రాజకీయాల్లో కుట్రలు సహజం. నన్ను వెనక్కి నెట్టేందుకు, అవకాశాలు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ భయపడకుండా ఎదుర్కొన్నాను. అందుకే ఇంత దూరం వచ్చాను.
ఎమ్మెల్సీ అవకాశం.. అనూహ్య మలుపు..
2007లో ఎమ్మెల్సీగా అవకాశం రావడం కూడా రాజకీయ పరిణామాల మధ్య జరిగింది. తొలుత హనుమకొండ నుంచి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం గురించి చర్చ జరిగింది. కొన్ని పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ బలం తక్కువగా ఉండటంతో గెలుపుపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే నాకున్న వ్యక్తిగత సంబంధాలతో టిఆర్ఎస్ సహకరించడంతో అనూహ్యంగా విజయం సాధించి 115 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను.

రెండుసార్లు చేజారిన మంత్రి పదవి..
2011లో మంత్రి పదవి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. పార్టీ అధిష్ఠానం నుంచి నా పేరు వచ్చింది. అప్పటి సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి కూడా నా పేరు ఖరారైందని చెప్పారు. కానీ మరుసటి రోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సమాచారం రాలేదు. తర్వాత అక్కడికి వెళ్లినప్పుడు రోశయ్య కూడా నా పేరు ఎలా మిస్ అయిందని ఆశ్చర్యపడ్డారు. మంత్రి వర్గ విస్తరణ సమయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. రెండుసార్లు అవకాశం చేజారినా రాజకీయ ఎదుగుదల మాత్రం ఆగలేదు. 2012లో చీఫ్ విప్గా బాధ్యతలు చేపట్టాను.2014 శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గ నుంచి ఓడిపోయాను.
2019లో బీఆర్ఎస్ వైపు అడుగులు..
2018లో అదే భూపాల్ పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందాను.2019లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరాను. కేటీఆర్తో ఉద్యమ కాలం నుంచే పరిచయం ఉంది. కేసీఆర్తోనూ మంచి అనుబంధం ఉంది. కేసీఆర్ పని చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఒకసారి కలిస్తే సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించి పరిష్కారాలు చూపించే తీరు ఆయనలో ఉంది.
రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగింది..
చిన్నప్పటి నుంచే కుటుంబ పరిస్థితులు కొంత అనుకూలంగా ఉండటంతో పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేదు. అయితే రాజకీయాల్లో డబ్బు కీలక అంశంగా మారింది. డబ్బు ఉంటే రాజకీయ ప్రయాణం కొంత సులభంగా సాగుతుంది. అందుకే వ్యాపార రంగంలోకి కూడా అడుగులు వేశాను. రాజకీయాల్లో అవకాశాలు చేజారిన సందర్భాల్లోనూ ముందుకు సాగేందుకు ఇతర మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది.
భూపాలపల్లే నా కుటుంబం..
భూపాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం నా రాజకీయ జీవితంలో ప్రత్యేకమైన ఘట్టం. అప్పట్లో భూపాలపల్లి అనేక సమస్యలకు నిలయంగా ఉండేది. ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేశాను. ప్రాథమిక వైద్య కేంద్రం స్థాయి నుంచి మెడికల్ కాలేజీ, వంద పడకల ఆస్పత్రి వరకు వైద్య సదుపాయాలు విస్తరించాయి. సింగరేణి కార్మికుల కోసం 2 వేల క్వార్టర్ల నిర్మాణానికి కృషి చేశాం. చెక్డ్యామ్లు, లిఫ్ట్ ఇరిగేషన్, రహదారుల విస్తరణ వంటి అనేక పనులు చేపట్టాం.
ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి. బైపాస్ రోడ్డు మంజూరైనా పూర్తి కాలేదు. ప్రజలన్నింటినీ ఒకేసారి సంతృప్తిపరచడం అంత సులభం కాదు. అయినా నిధుల కోసం ప్రభుత్వాన్ని పదేపదే నిలదీసి పనులు సాధించేందుకు ప్రయత్నించాను. భూపాలపల్లి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో కూడిన ప్రత్యేకమైన నియోజకవర్గం. నా రాజకీయ ప్రయాణం మొత్తం భూపాలపల్లితో ముడిపడి ఉంది. భూపాలపల్లే నా కుటుంబం.. దాని అభివృద్ధే నా లక్ష్యం.
ఆరోపణలు, విమర్శలకు రాజకీయంగానే సమాధానం..
రాజకీయ కక్షతో తనపై భూకబ్జాల ఆరోపణలు చేస్తున్నారని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. తాను భూములను కాపాడేందుకు కోర్టును ఆశ్రయించిన సందర్భాలున్నాయని చెప్పారు. గుడి, బడి,ఎకో పార్క్, వాకింగ్ ట్రాక్ వంటి ప్రజా అవసరాల కోసం చేపట్టిన పనులను కూడా రాజకీయంగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు న్యాయపరంగానూ, రాజకీయంగానూ సమాధానం చెబుతానన్నారు.
అవకాశం వస్తే గండ్ర జ్యోతి బరిలో..
తన రాజకీయ ప్రయాణంలో భార్య గండ్ర జ్యోతి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. మహిళలతో ఆమెకు మంచి అనుబంధం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే వరంగల్ జెడ్పీ చైర్పర్సన్గా, భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉందన్నారు.
ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతు భరోసా, పెన్షన్లు, బీమా, మహిళలకు ఇచ్చిన హామీలు, యూరియా వంటి అంశాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం అనే మత్తులో తులతూగుతుందని,ప్రస్తుత పాలనపై ప్రజలు త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని చెప్పారు.
ప్రజల తీర్పును పనితోనే కోరుతా..
ప్రస్తుత రాజకీయాల్లో పనితీరు, గెలుపోటముల మధ్య గతంలో ఉన్న సంబంధం మారిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు చేసిన పనులను చూసి ప్రజలు నాయకులను ఎన్నుకునేవారని, ఇప్పుడు ఎన్నికల సమయంలో అనేక ఇతర అంశాలు ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గమంతా పాదయాత్ర చేసి ప్రజలను కలుస్తానని చెప్పారు. తాను చేసిన అభివృద్ధి పనులతో పాటు ఇంకా చేయాల్సిన పనులను ప్రజల ముందుంచుతానన్నారు.
మళ్లీ ప్రజల మధ్యకే..
భూపాలపల్లి ప్రజలతో తనకు ఉన్న అనుబంధమే అసలైన బలమని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఓటమితో ప్రజలకు దూరం కావాల్సిన అవసరం లేదని, ప్రజల మధ్యే ఉంటూ సమస్యలను తెలుసుకోవాలని భావిస్తున్నానన్నారు. నియోజకవర్గంలో పూర్తికాని పనులను గుర్తించి వాటి కోసం పోరాడతానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం లభిస్తే భూపాలపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.
గౌతమ్కు రాజకీయ స్వేచ్ఛ..
తన కుమారుడు గండ్ర గౌతమ్ రాజకీయ ప్రవేశం పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా స్వాగతిస్తానన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, గౌతమ్ కూడా తనకు నచ్చిన సమయంలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానన్నారు. రానున్న రోజుల్లో ఆయన కేటీఆర్ బృందంలో పనిచేస్తారని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.
కుటుంబ నేపథ్యం..
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో 1966 మే 5న గండ్ర సుశీల, మోహన్ రెడ్డి దంపతులకు వెంకట రమణారెడ్డి జన్మించారు. ఆయనకు అక్క సుజాత, చెల్లె సుభాషిని, తమ్ముడు భూపాల్ రెడ్డి వున్నారు.1985 ఏప్రిల్ 14న జ్యోతిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు గౌతమ్, కుమార్తె ప్రియాంక ఉన్నారు. రమణారెడ్డి విద్యాభ్యాసం పరకాల, హనుమకొండ, హైదరాబాదులో కొనసాగింది. ఆర్థికంగా స్థితిమంతుడైనప్పటికీ సింప్లిసిటీకి ప్రాధాన్యతను ఇస్తారు.సాధారణ జీవనశైలి, అసాధారణ ఆలోచన విధానం, స్పష్టమైన లక్ష్యం, అ అచంచలమైన ఆత్మవిశ్వాసం.. ఇవే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యక్తిత్వానికి ప్రత్యేక గుర్తింపు లు.
