- మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక
- అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్
- ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ
- ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం
- మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం
- మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం
- జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక
- జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
వరంగల్ వాయిస్, ములుగు: మార్చి 6వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన… ప్రగతి ప్రణాళికలు కార్యాచరణ అమలుపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, హోం, రవాణా, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ, హౌసింగ్, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయిదు దశల్లో అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రోడ్డు భద్రతా చర్యలు, వివిధ వర్గాల వారి సంక్షేమం, కల్తీ కల్లు, మత్తు పదార్థాల నిరోధానికి చేపట్టాల్సిన పకడ్బందీ చర్యలు, రైతు సంక్షేమం.. వ్యవసాయం, విద్య, యువత.. క్రీడలు, మహిళల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, అన్ని శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.



