Warangalvoice

cpi news

కార్పొరేట్ వర్గాలకు మోడీ ఊడిగం

  • కమ్యూనిజం ప్రపంచ వ్యాప్త సిద్దాంతం
  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి
  • వరంగల్ లో ద్వితీయ జిల్లా మహాసభలు ప్రారంభం

వరంగల్ వాయిస్, వరంగల్ : కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లా సీపీఐ ద్వితీయ మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక అబ్నూస్ ఫంక్షన్ హాల్ లో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి అధ్యక్షత జరిగిన సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మోడీ పాలనలో అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ప్రజాస్వామ్యం గొంతునొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. గత 11 ఏళ్లుగా ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారు బీజేపీతో అంటగాగుకున్నారని విమర్శించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను తుంగలో తొక్కుతూ రచయితలను, కవులను, కళాకారులను, విద్యావేత్తలను అణిచివేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను మంటగలుపుతున్నారన్నారు. నిరుద్యోగం, ఆకలి, దారిద్రం నిరంతరం పెరుగుతూ పేదలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారుతోందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం ఆదివాసీలను హత్య చేస్తున్నదని, కమ్యూనిస్టులను అంతం చేయాలని కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. మావోయిస్టులపై చేపట్టిన మారణకాండను నిలిపివేయాలని సీపీఐ మొదటి నుంచి పోరాడుతుందన్నారు. కమ్యూనిస్టులను అంతం చేయలేరని, కమ్యూనిజం ప్రపంచ వ్యాప్త సిద్దాంతం అన్నారు.

నగరంలో భారీ ప్రదర్శన..
సీపీఐ జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా వరంగల్ నగరంలో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. శివనగర్ లోని సీపీఐ కార్యాలయం తమ్మెర భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వరంగల్ చౌరస్తా మీదుగా పోచమ్మ మైదాన్ వరకూ సాగింది. ఈ ప్రదర్శన అనంతరం జరిగిన సభలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర నాయకులు టి.వెంకట్రాములు, సిరబోయిన కరుణాకర్, పంజాల రమేష్, సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి, పల్లె నర్సింహా, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ కే బాష్ మియా, పనాస ప్రసాద్, నాయకులు గన్నారపు రమేష్, దండు లక్ష్మణ్, అక్కపెల్లి రమేష్, బుస్సా రవీందర్, తోట చంద్రకళ, సంగి ఎలేందర్, గుండె బద్రి, ఆరెళ్లి రవి, కె.చెన్నకేశవులు, జి.మునీశ్వర్, దామెర క్రిష్ణ, వి.శంకరయ్య, ఎండి.ఖాసీం, కుమారస్వామి, రాజు, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *