Warangalvoice

Government is committed to the welfare of minorities

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ తూర్పులో  ‘ఈద్ కా తోఫా’ పంపిణీ
పేద ముస్లింలకు రంజాన్ కానుకలు 

వరంగల్ వాయిస్, వరంగల్ : రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “ఈద్ కా తోఫా” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు ప్రభుత్వం తరపున దుస్తుల కిట్లను పంపిణీ చేశారు.

నియోజకవర్గానికి 3500 కిట్లు.. సీఎంకు కృతజ్ఞతలు:
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ పరస్పర ప్రేమ, దయ మరియు త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో సోదరభావం పెంపొందేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రత్యేకంగా 3500 దుస్తుల కిట్లను కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కానుకల వల్ల నిరుపేద ముస్లిం కుటుంబాలు పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సామాజిక ఐక్యతకు పండుగలే వేదిక – కలెక్టర్ సత్య శారద:
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసం మనుషుల్లో కరుణ, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఫుర్ఖాన్, సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, చింతాకుల అనిల్ కుమార్, బస్వరాజు కుమారస్వామితో పాటు ఆర్డీవో సుమ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రమేష్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, తహశీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *