Skip to main content

Warangalvoice

క్యూసీఓ అమలును వాయిదా వేయాలి


కేంద్రానికి తెలంగాణ కాటన్ అసోసియేషన్ విన్నపం
వరంగల్ వాయిస్,వరంగల్ : కాటన్ బేల్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్-2023 అమలును ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయాలని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం భారత ప్రభుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ (ఫైబర్) పద్మిని సింగ్లా అధ్యక్షతన నిర్వహించిన వాటాదారుల సంప్రదింపుల సమావేశంలో ఆయన ఆన్‌లైన్ ద్వారా పాల్గొని జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వివరించారు. తెలంగాణలో పత్తి సాగు, దిగుబడిలో ఎదురవుతున్న ప్రకృతి పరమైన సవాళ్లను రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.  అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసే వర్షాల వల్ల పత్తి నాణ్యత దెబ్బతింటోందని తెలిపారు.  మొదటి, రెండో విడత పత్తి నాణ్యతగా ఉన్నప్పటికీ.. మూడు, నాలుగో విడత వచ్చేసరికి నాణ్యతలో మార్పులు వస్తాయని, పింక్ బోల్ వార్మ్ వంటి తెగుళ్ల ప్రభావం కూడా ఉంటుందని పేర్కొన్నారు.  క్వాలిటీ పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిన్నింగ్ మిల్లర్ల సహకారంతో రైతులకు శిక్షణా సదస్సులు నిర్వహించాలని కోరారు.  అసోసియేషన్ ప్రతినిధులు జిన్నింగ్ పరిశ్రమ మనుగడ కోసం ఈ క్రింది ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు.  నాణ్యతా ప్రమాణాలు పాటించే మిల్లర్లకు స్పిన్నింగ్ మిల్లుల ద్వారా ప్రతి క్యాండీకి రూ. 500/- ప్రోత్సాహకం అందించాలి. అంతర్జాతీయంగా పత్తి ఎగుమతులను పెంచడానికి అదనంగా 3% ప్రోత్సాహక మొత్తాన్ని ప్రకటించాలి.  బీఐఎస్ నిబంధనలతో సంబంధం లేకుండా జిన్నర్లను నమోదు చేసుకునేలా సీసీఐ  అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. కాలపరిమితి పెంపు: ఆగస్టు 2026 నుంచి అమలులోకి రానున్న క్యూసీఓ నిబంధనలను, పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల దృష్ట్యా మరింత కాలం వాయిదా వేయాలి.  ప్రస్తుతం నిర్దేశించిన కఠినమైన నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు చేయడం అసాధ్యమని, దీనివల్ల జిన్నింగ్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రీ కట్కూరి నాగభూషణం, వరంగల్ జిల్లా కోశాధికారి శ్రీ గోపిశెట్టి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *