Skip to main content

Warangalvoice

మెరుగైన వైద్య సేవలు అందించాలి


కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ వాయిస్, దామెర : విద్యార్థులు లక్ష్యశుద్ధితో, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె దామెర మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేసి, అభివృద్ధి పనులను పరిశీలించారు.  మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్, పాఠశాలలోని వంటగది, స్టోర్ రూమ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, నిల్వ ఉంచే సరుకుల విషయంలో జాగ్రత్తలు వహించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారి విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకుంటూ, క్రమశిక్షణతో చదువుకోవాలని దిశానిర్దేశం చేశారు.  అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల కనికరంతో వ్యవహరించాలని సూచించారు. పులుకుర్తి గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను కలెక్టర్ సందర్శించారు. సాగు విధానం, దిగుబడిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాభదాయకమైన పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ  డాక్టర్ అప్పయ్య, పరకాల ఆర్డిీఓ డాక్టర్ కన్నం నారాయణ, దామెర తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, స్థానిక సర్పంచ్  కల్పన, వైద్యాధికారులు  డాక్టర్ మహేంద్ర, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ శాంతి ప్రియ, డాక్టర్ ఎస్ కే జాస్మిన్  మెహర, డాక్టర్ ప్రమోద్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *