Skip to main content

Warangalvoice

వెలుగుల మేడారంగా తీర్చిదిద్దాం

🎯 విద్యుత్ శాఖ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
🎯 జాతరలో అత్యుత్తమ పనితీరు..
🎯 సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత
🎯 గోదావరి పుష్కరాలకు కూడా సిద్ధం
🎯 హనుమకొండలో ‘విద్యుత్ విజయోత్సవం’

వరంగల్ వాయిస్, హనుమకొండ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అన్ని శాఖల కంటే విద్యుత్ శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘మేడారం జాతర విద్యుత్ విజయోత్సవ’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కోట్లాది మంది భక్తులకు కన్నుల విందుగా, ఎక్కడా అంతరాయం లేకుండా వెలుగుల మేడారాన్ని అందించామని సీఎండీ కొనియాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా తొలిసారిగా 33 కేవీ లైన్లలో కవర్ కండక్టర్లను వాడామని, భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను మరింత విస్తరిస్తామని వెల్లడించారు. లోడ్ తగ్గించేందుకు గట్టమ్మ వద్ద కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. రద్దీలోనూ విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ‘సైరన్’లతో కూడిన బైక్‌లను సిబ్బందికి అందిస్తాం.
జాతరలో సోలార్ ఎల్ఈడీ లైట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాం.
పుష్కరాలకు సన్నద్ధం
రాబోయే గోదావరి పుష్కరాలకు ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పారు. తాత్కాలిక దుకాణదారుల కోసం ఆన్‌లైన్ పేమెంట్ స్కానర్లు అందుబాటులోకి తెస్తామని, కంట్రోల్ రూమ్‌ను సాంకేతికంగా మరింత ఆధునీకరిస్తామని చెప్పారు. “మీ అందరితో కలిసి పని చేయడం గర్వంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులతో భక్తులకు గొప్ప సేవలు అందించాం” అని వరుణ్ రెడ్డి ఉద్వేగంగా పేర్కొన్నారు. జాతర విధుల్లో కఠినంగా శ్రమించిన అధికారులు, సిబ్బంది మరియు ఏజెన్సీ ప్రతినిధులకు ఈ సందర్భంగా ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు తిరుమల్ రావు, రాజు చౌహాన్, భూపాలపల్లి ఎస్ఈ మల్చూరు నాయక్, ములుగు ఎస్ఈ ఆనందం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *