Skip to main content

Warangalvoice

భారీగా నకిలీ టీ పొడి సీజ్


వరంగల్ వాయిస్, దామెర : ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్న నకిలీ టీ పొడి ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. శుక్రవారం గూడెప్పాడ్ సెంటర్ సమీపంలోని ఎం.ఎం మార్ట్ లో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 40 కిలోల నకిలీ టీ పొడిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి, మౌనిక స్థానికులకు, వినియోగదారులకు నకిలీ టీ పొడిని గుర్తించే విధానంపై ప్రత్యక్షంగా డెమో ఇచ్చారు. సాధారణ నీటిలో టీ పొడి వేసినప్పుడు, అది వెంటనే రంగును విడిచిపెడితే అది కల్తీ టీ పొడిగా భావించాలని తెలిపారు. సహజమైన టీ పొడి వేడి నీటిలో మరిగించినప్పుడు మాత్రమే రంగును సంతరించుకుంటుందని వివరించారు. కృత్రిమ రంగులు కలిపిన టీ పొడి వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. అనంతరం పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించి నకిలీ వస్తువులను విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట ఎస్సై పరమేశ్వర్, దామెర ఎస్సై కొంక అశోక్, ఫుడ్ సేఫ్టీ సిబ్బంది, శాయంపేట సర్కిల్ పోలీస్ బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *