Skip to main content

Warangalvoice

ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం….వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం : విద్యాసంస్థల్లో ఎవరైన విద్యార్థులు ర్యాగింగ్‌ లాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న తరుణంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ర్యాగింగ్‌ నియంత్రణపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదివారం ఓ ప్రకటన చేస్తూ విద్యా సంస్థలలో ర్యాగింగ్‌కు పాల్పడటం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని అన్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడే విధంగా వుంటుందని, ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్‌ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుండి తొలగించడంతో పాటు ర్యాగింగ్‌ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ర్యాగింగ్‌ పాల్పడిన విద్యార్థుల విద్యా, ఉద్యోగ, భవిష్యత్తు అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు.
అలాగే విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ నియంత్రణకై యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వుంటుందని ఇందులో భాగంగా ప్రతి ఉన్నత విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు స్వ్కాడ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. నూతనంగా వచ్చిన విద్యార్థుల కోసం ప్రత్యేక పరివేక్షణ వుండాలని ముఖ్యంగా ర్యాగింగ్‌ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలతో పాటు సెమినార్లు, వర్క్‌షాపులు నిరంతరం నిర్వహించాలన్నారు.విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకుగాను 24గంటల హైల్ప్‌లైన్‌ నంబర్లను విద్యాసంస్థల యాజమాన్యం అందుబాటులో వుంచాలని విద్యార్థులు సహ విద్యార్థులపై ఎటువంటి వేధింపులు, దౌర్జన్యాలు, అసభ్య కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎవరైన ర్యాగింగ్‌కు గురైతే తక్షణమే ప్రిన్సిపాల్‌, యాజమాన్యం లేదా పోలీసులకు సమచారం అందించాలని సూచించారు.ర్యాగింగ్‌కు పాల్పడం ద్వారా విద్యా భవిష్యత్తు నాశనం అవుతుందని ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ సూచిస్తూ ర్యాగింగ్‌ అనేది విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాకుండా సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని కావున విద్యా సంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విధ్యార్థులు పోలీసులు కలిసి పనిచేసిప్పుడే ర్యాగింగ్‌ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించగలుతామని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *